వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్  

వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్  

సీసీఐ కొనుగోళ్లు​ బంద్​

జనగామ, వెలుగు : జనగామలో సీసీఐ కొనుగోళ్లు వచ్చే నెల 1 నుంచి 5 వరకు బంద్​ఉండనున్నట్లు అగ్రికల్చర్  మార్కెట్ ప్రథమ శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్​ తెలిపారు. 1న కొత్తం సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ సెలవుండగా, మిల్లుల్లో పత్తి పేరుకుపోయిన కారణంగా 2, 3వ తేదీల్లో కొనుగోలు కేంద్రాలు బంద్​ ఉండనున్నాయన్నారు. 4, 5 శని ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం నుంచి తిరిగి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయన్నారు. రైతులు గమనించి పత్తిని మిల్లులకు తీసుకురావద్దని కోరారు.

బల్దియా సమావేశం రద్దు

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ మహానగర పాలక సంస్థ మంగళవారం నిర్వహించ తలపెట్టిన సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదాపడింది. మాజీ  ప్రధాని మన్మోహన్​సింగ్​మృతికి సంతాప దినాలు పాటించడంతో నేటి సమావేశం రద్దు చేస్తున్నట్లు మేయర్​సుధారాణి, బల్దియా సెక్రటరీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.  

జనగామ ఏఎస్పీగా చేతన్​ నితిన్​

జనగామ, వెలుగు : జనగామ ఏఎస్పీగా పండరి చేతన్​ నితిన్ నియామకమయ్యారు. ఈ మేరకు డీజీపీ జితేందర్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

స్కూల్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు 

వర్ధన్నపేట, వెలుగు : వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యింది. దీంతో వర్ధన్నపేటకు చెందిన ఎన్​ఆర్​ఐ అల్లంనేని పూర్ణచందర్​రావు స్కూల్​లో సీసీ కెమెరాలు, ఆటవస్తువులు, ఎన్సీసీ కెడెట్లకు పరికరాలు సమకూర్చేందుకు రూ.లక్ష విరాళం ఇచ్చారు. దీంతో వాటిని ఏర్పాటు చేసి సోమవారం పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్​పర్సన్​దుబాసి బాయమ్మ, ప్రధానోపాధ్యాయులు రంగా అనిల్ సీనియర్ ఉపాధ్యాయులు రమణారావు, ప్రముఖులు మోహన్ రావు కలిసి ప్రారంభించారు. 

కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతి 

ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : కారు బైక్ ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ ఎర్రి గట్టమ్మ టెంపుల్ వద్ద సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలం పస్ర గ్రామానికి చెందిన మోపిదేవి నాగరాజు (31) బైక్​పై వెళ్తుండగా, గోవిందరావుపేట నుంచి ములుగు వైపు వెళ్తున్న కారు బైక్​ను వేగంగా ఢీకొట్టడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ములుగు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

స్టడీ మెటీరియల్స్ పంపిణీ

నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు : టెన్త్ క్లాస్ లో కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఈవో రవీందర్ రెడ్డి చెప్పారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి హై స్కూల్లో టెన్త్ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. రూ.30వేలువైన స్టడీ మెటీరియల్స్ అందజేసిన టీచర్లు బండ శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గుప్తా, లయన్స్ క్లబ్ తొర్రూర్ ప్రెసిడెంట్ సురేశ్​ను డీఈవో అభినందించారు.